Wednesday, March 20, 2019

నాన్న

ఇవాళ సాయంత్రం చెల్లి ఇంటి నుండి తిరిగి వస్తుంటే ఎందుకో మేము చిన్నప్పుడు కలిసి చేసిన అల్లరి గుర్తుకు వచ్చింది.మా నాన్నగారు మమ్మల్ని తీసుకువెళ్ళిన మొదటి సినిమా గుర్తొచ్చింది. ఈ రోజుల్లో సినిమాలు చాలా మామూలు అయ్యింది కాని నా చిన్నతనంలో మా నాన్నగారు సినిమాకి తీసుకువెళ్ళడం అనేది చాలా పెద్ద విషయం.

2003 సంవత్సరం, నేను 9వ తరగతి అప్పుడు. మా ఇంటి చుట్టు ప్రక్కల అందరూ మోటారు బండ్లు కొంటున్నారు.మా నాన్నగారు మాత్రం ఇంకా సైకిలు మీదనే ఉద్యోగానికి వెళ్ళి వచ్చేవారు. పోను 5 రాను 5 కిలోమీటర్లు రోజు సైకిలు తొక్కేవారు. మా వీధిలో నా స్నేహితుల తండ్రులు అంతా బండ్లు కొనేసారు. మా వీదిలో బండిలేనిది ఒక్క మా నాన్నగారికే. నేను చెల్లి రోజు గోల చేసేవాళ్ళం బండికొనండి అని. మా చదువులు , అప్పటికే ఇల్లు కట్టడం కోసం బాంకులో తీసుకున్న అప్పు ఉండటం మూలాన నాన్నగారి దగ్గర నెలవారి ఖర్చులకే సరిపొయేవి కాదు. ఇవన్ని తెలియని మేము మా నాన్న పిసినారోడు అని అనుకునేవాళ్ళం.

మా పోరువల్లనో లేక నాన్నగారి అవసరమో మొత్తానికి బండి కొనాలి అనే నిర్ణయానికి వచ్చారు నాన్నగారు. ఏ బండి కొనాలనేది ఆలోచన. మా వీధిలో సగానికి పైగా హీరో హోండా స్ప్లెండర్ బండ్లు ఉండేవి. మేము కూడా అదే కావాలి అని చెప్పాం. నాన్నగారికి నలుపు రంగు అంటే నచ్చదు , స్ప్లెండర్ మాత్రం నలుపు రంగులోనే వచ్చేది. నాన్నగారికి ఎరుపు రంగు బండి అయితే ఇష్టం. ఇలా కొంత కాలం ఏ బండి కొనాలి అన్న తర్జన భర్జనల్లోనే గడిచిపోయింది. ఇంక నాన్నగారు బండి కొనరేమో అని నేను ఊరుకుండిపొయాను.

ఉన్నట్టుండి ఒకరోజు నాన్నగారు "రేపు మన బండి ఇంటికి వస్తుంది" అన్నారు. ఏం బండి అని అడిగాను. హీరో హోండా కంపనీ బండే అన్నారు. దాని పేరు చెప్పినా నాకు అర్థం అవ్వలేదు. మరునాడు నేను బడికి వెళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి ఇంటి ముందు పసుపు కుంకుమా గంధం పూసుకొని ముస్తాబై ఉంది మా బండి.పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని అన్నివైపులా పరీక్షించి చూసా.ఎక్కి కూర్చొని ఆనంద పడిపొయా "మాకు బండి ఒచ్చేసిందొచ్ !!" అని. ఇంట్లోకి వెళ్ళేసరికి అమ్మ వంట చేస్తుంది.
నన్ను చూసి నాన్నగారు "చిన్నా బండి చూసావా? ఎలా ఉంది?" అనడిగారు.
"బాగుంది" అని కొండంత ఆనందంతో చెప్పా.
ఇదిగో ఇవి నీకూ చెల్లికి అంటూ ఒక పెద్ద ప్లాస్టిక్ డబ్బానిండా ఉన్న సొంపాపడి నా ముందు ఉంచారు.అందులో కనీసం ఒక 70 అయినా ఉంటాయి. చిన్నతనంలో అజలే అవంటే నాకు పిచ్చి. ఇంక వాటిని చూసాక ఆనందం పట్టలేకపొయాను. టపీ టపీమని ఒక్కొక్కటిగా నోట్లో కుక్కోడం మొదలుపెట్టాను. మూడు తినేసరికి ఇంక చాలు అని అమ్మ వారించింది. అంత ఆనందం నాన్న బండి కొంటే.

తరువాత రోజు ఆదివారం. నాన్నగారు నన్ను చెల్లిని మా కొత్త బండి మీద సినిమాకి తీసుకువెళ్తా అని చెప్పారు. ఠాగూర్ సినిమా. చిరంజీవి సినిమా అసలే. పక్క ఊరు వెళ్ళాలి. సుమారు ఒక 30కిలోమీటర్లు ఉంటుంది. రాత్రంతా నేను చెల్లి "ఠాగూర్ టంగు తెగుద్ది" అని డైలాగులు. తెల్లరి మా కొత్త బండి మీద ఝాం ఝామ్మని సినిమా చూసి వచ్చేసాం. బళ్ళో స్నేహితుల దగ్గర కొట్టిన్న ఫొజు ఇంకా గుర్తుంది నాకు. మా బండి మీద వెసవిలో మా అమ్మమ్మగారి ఇంటికి వెళ్ళాం. మా ఊరి నుండి మా అమ్మమ్మగారి ఊరు 200కిమి ఉంటుంది. 2 సంవత్సరాల క్రితం చెల్లి పెళ్ళి చేసినప్పుడు కూడా అదే బండి మీద దగ్గర్లో ఉన్న ఊర్లన్ని తిరిగాం.

16 ఏళ్ళు , ఇంకా ఆ బండి మా నాన్నని మమ్మల్ని మోస్తుంది. మా సంతోషాల్లో, బాధల్లో మా కుటుంబ సభ్యుడిగా ఉంది. ఇప్పుడు నేను బండి కొనుక్కోవాలి అనుకున్నాను. మా నాన్నగారిని నాతో పాటు బండి షోరూంకి తీస్కెళ్ళి నాకు నచ్చిన బండి చూపించి, ఇంటికి వెళ్ళి ఆయన ఇష్టం కూడా కనుక్కొని కొన్నాను. ఇది గౌరవమో లేక బాధ్యతో కాదు. మా నాన్న తన ఆనందాన్ని మాతో పంచుకున్నాడు. ఆనాడు మా సంతోషం కోసమే బండి కొన్నారు. స్వీట్లు , సినిమా ఇంకా ఎన్నో. మేము తప్ప ఎవరూ లేరు తన ప్రపంచంలో. ఇప్పుడు రెక్కలొచ్చాయని ఆయన్ని ఒంటరి చేసి ఎగిరిపొతే ఎలా ? అందుకే నా ఆనందాన్ని, నా మొదటి బండిని మా నాన్నతో పంచుకుందామని అలా చేసా !!

అన్వేషణ

శోధిస్తున్నా ఈ ప్రపంచాన్ని నేను
నాలో ఉన్న మౄగాన్ని మరణందరికి చేర్చే ఆయుధం కోసం.
అన్వేషిస్తున్నా ఈ మనుషుల ఎడారిని నేను
నాలో ఉన్న బాటసారికి గమ్యం దొరికేవరకు.
నిద్రిస్తున్నా ఈ నిర్జీవపు జీవిత మెలకువలో
నిరుత్సాహపు కలల మత్తు చెదరగొట్టే ఉత్తేజపు ఆశల కిరణాల కోసం !!

పున్నమినాటి అల

నడిచే కాలపు అడుగుల సవ్వడి
నా గుండె చప్పుడుతో జతకట్టిందేమో?!
జారిపోతున్న నా జీవిత కాలాన్ని నాతో లెక్కింపజేయాలని !
గోడకు వేలాడుతున్న గడియారం భయపెడుతుంది
నేను ఒంటరిగానే మిగిలిపోతానని !!
మనసొకరి దగ్గర నేనొక దగ్గర
ఒంటరిని కాక మరేమౌతాను నేను ?
తోడుంటానని మాటిచ్చిన ప్రేయసి
పున్నమినాటి అలలా పలకరింతలకే పరిమితమైంది !!
తప్పు దూరానిది కాదు, ప్రేమది , ప్రేమించిన మనసుది !!

నాన్న

ఇవాళ సాయంత్రం చెల్లి ఇంటి నుండి తిరిగి వస్తుంటే ఎందుకో మేము చిన్నప్పుడు కలిసి చేసిన అల్లరి గుర్తుకు వచ్చింది.మా నాన్నగారు మమ్మల్ని తీసుకువె...