Wednesday, March 20, 2019

నాన్న

ఇవాళ సాయంత్రం చెల్లి ఇంటి నుండి తిరిగి వస్తుంటే ఎందుకో మేము చిన్నప్పుడు కలిసి చేసిన అల్లరి గుర్తుకు వచ్చింది.మా నాన్నగారు మమ్మల్ని తీసుకువెళ్ళిన మొదటి సినిమా గుర్తొచ్చింది. ఈ రోజుల్లో సినిమాలు చాలా మామూలు అయ్యింది కాని నా చిన్నతనంలో మా నాన్నగారు సినిమాకి తీసుకువెళ్ళడం అనేది చాలా పెద్ద విషయం.

2003 సంవత్సరం, నేను 9వ తరగతి అప్పుడు. మా ఇంటి చుట్టు ప్రక్కల అందరూ మోటారు బండ్లు కొంటున్నారు.మా నాన్నగారు మాత్రం ఇంకా సైకిలు మీదనే ఉద్యోగానికి వెళ్ళి వచ్చేవారు. పోను 5 రాను 5 కిలోమీటర్లు రోజు సైకిలు తొక్కేవారు. మా వీధిలో నా స్నేహితుల తండ్రులు అంతా బండ్లు కొనేసారు. మా వీదిలో బండిలేనిది ఒక్క మా నాన్నగారికే. నేను చెల్లి రోజు గోల చేసేవాళ్ళం బండికొనండి అని. మా చదువులు , అప్పటికే ఇల్లు కట్టడం కోసం బాంకులో తీసుకున్న అప్పు ఉండటం మూలాన నాన్నగారి దగ్గర నెలవారి ఖర్చులకే సరిపొయేవి కాదు. ఇవన్ని తెలియని మేము మా నాన్న పిసినారోడు అని అనుకునేవాళ్ళం.

మా పోరువల్లనో లేక నాన్నగారి అవసరమో మొత్తానికి బండి కొనాలి అనే నిర్ణయానికి వచ్చారు నాన్నగారు. ఏ బండి కొనాలనేది ఆలోచన. మా వీధిలో సగానికి పైగా హీరో హోండా స్ప్లెండర్ బండ్లు ఉండేవి. మేము కూడా అదే కావాలి అని చెప్పాం. నాన్నగారికి నలుపు రంగు అంటే నచ్చదు , స్ప్లెండర్ మాత్రం నలుపు రంగులోనే వచ్చేది. నాన్నగారికి ఎరుపు రంగు బండి అయితే ఇష్టం. ఇలా కొంత కాలం ఏ బండి కొనాలి అన్న తర్జన భర్జనల్లోనే గడిచిపోయింది. ఇంక నాన్నగారు బండి కొనరేమో అని నేను ఊరుకుండిపొయాను.

ఉన్నట్టుండి ఒకరోజు నాన్నగారు "రేపు మన బండి ఇంటికి వస్తుంది" అన్నారు. ఏం బండి అని అడిగాను. హీరో హోండా కంపనీ బండే అన్నారు. దాని పేరు చెప్పినా నాకు అర్థం అవ్వలేదు. మరునాడు నేను బడికి వెళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి ఇంటి ముందు పసుపు కుంకుమా గంధం పూసుకొని ముస్తాబై ఉంది మా బండి.పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని అన్నివైపులా పరీక్షించి చూసా.ఎక్కి కూర్చొని ఆనంద పడిపొయా "మాకు బండి ఒచ్చేసిందొచ్ !!" అని. ఇంట్లోకి వెళ్ళేసరికి అమ్మ వంట చేస్తుంది.
నన్ను చూసి నాన్నగారు "చిన్నా బండి చూసావా? ఎలా ఉంది?" అనడిగారు.
"బాగుంది" అని కొండంత ఆనందంతో చెప్పా.
ఇదిగో ఇవి నీకూ చెల్లికి అంటూ ఒక పెద్ద ప్లాస్టిక్ డబ్బానిండా ఉన్న సొంపాపడి నా ముందు ఉంచారు.అందులో కనీసం ఒక 70 అయినా ఉంటాయి. చిన్నతనంలో అజలే అవంటే నాకు పిచ్చి. ఇంక వాటిని చూసాక ఆనందం పట్టలేకపొయాను. టపీ టపీమని ఒక్కొక్కటిగా నోట్లో కుక్కోడం మొదలుపెట్టాను. మూడు తినేసరికి ఇంక చాలు అని అమ్మ వారించింది. అంత ఆనందం నాన్న బండి కొంటే.

తరువాత రోజు ఆదివారం. నాన్నగారు నన్ను చెల్లిని మా కొత్త బండి మీద సినిమాకి తీసుకువెళ్తా అని చెప్పారు. ఠాగూర్ సినిమా. చిరంజీవి సినిమా అసలే. పక్క ఊరు వెళ్ళాలి. సుమారు ఒక 30కిలోమీటర్లు ఉంటుంది. రాత్రంతా నేను చెల్లి "ఠాగూర్ టంగు తెగుద్ది" అని డైలాగులు. తెల్లరి మా కొత్త బండి మీద ఝాం ఝామ్మని సినిమా చూసి వచ్చేసాం. బళ్ళో స్నేహితుల దగ్గర కొట్టిన్న ఫొజు ఇంకా గుర్తుంది నాకు. మా బండి మీద వెసవిలో మా అమ్మమ్మగారి ఇంటికి వెళ్ళాం. మా ఊరి నుండి మా అమ్మమ్మగారి ఊరు 200కిమి ఉంటుంది. 2 సంవత్సరాల క్రితం చెల్లి పెళ్ళి చేసినప్పుడు కూడా అదే బండి మీద దగ్గర్లో ఉన్న ఊర్లన్ని తిరిగాం.

16 ఏళ్ళు , ఇంకా ఆ బండి మా నాన్నని మమ్మల్ని మోస్తుంది. మా సంతోషాల్లో, బాధల్లో మా కుటుంబ సభ్యుడిగా ఉంది. ఇప్పుడు నేను బండి కొనుక్కోవాలి అనుకున్నాను. మా నాన్నగారిని నాతో పాటు బండి షోరూంకి తీస్కెళ్ళి నాకు నచ్చిన బండి చూపించి, ఇంటికి వెళ్ళి ఆయన ఇష్టం కూడా కనుక్కొని కొన్నాను. ఇది గౌరవమో లేక బాధ్యతో కాదు. మా నాన్న తన ఆనందాన్ని మాతో పంచుకున్నాడు. ఆనాడు మా సంతోషం కోసమే బండి కొన్నారు. స్వీట్లు , సినిమా ఇంకా ఎన్నో. మేము తప్ప ఎవరూ లేరు తన ప్రపంచంలో. ఇప్పుడు రెక్కలొచ్చాయని ఆయన్ని ఒంటరి చేసి ఎగిరిపొతే ఎలా ? అందుకే నా ఆనందాన్ని, నా మొదటి బండిని మా నాన్నతో పంచుకుందామని అలా చేసా !!

అన్వేషణ

శోధిస్తున్నా ఈ ప్రపంచాన్ని నేను
నాలో ఉన్న మౄగాన్ని మరణందరికి చేర్చే ఆయుధం కోసం.
అన్వేషిస్తున్నా ఈ మనుషుల ఎడారిని నేను
నాలో ఉన్న బాటసారికి గమ్యం దొరికేవరకు.
నిద్రిస్తున్నా ఈ నిర్జీవపు జీవిత మెలకువలో
నిరుత్సాహపు కలల మత్తు చెదరగొట్టే ఉత్తేజపు ఆశల కిరణాల కోసం !!

పున్నమినాటి అల

నడిచే కాలపు అడుగుల సవ్వడి
నా గుండె చప్పుడుతో జతకట్టిందేమో?!
జారిపోతున్న నా జీవిత కాలాన్ని నాతో లెక్కింపజేయాలని !
గోడకు వేలాడుతున్న గడియారం భయపెడుతుంది
నేను ఒంటరిగానే మిగిలిపోతానని !!
మనసొకరి దగ్గర నేనొక దగ్గర
ఒంటరిని కాక మరేమౌతాను నేను ?
తోడుంటానని మాటిచ్చిన ప్రేయసి
పున్నమినాటి అలలా పలకరింతలకే పరిమితమైంది !!
తప్పు దూరానిది కాదు, ప్రేమది , ప్రేమించిన మనసుది !!

Wednesday, September 19, 2018

కుద్రేముఖ

ఎన్నో ఏళ్ళుగా అనుకుంటున్నది ఇవ్వల్టికి నెరవేరింది. ద్విచక్ర వాహనం నడుపుకుంటు ఈ ప్రకౄతిలో విహరించాలన్న నా కోరిక నెరవేరింది. సొంత వాహనం లేదు. అంతగా నడిపిన అనుభవం లేదు. పైగా వెళ్ళేది పడమటి కనుమల్లోకి. వెళ్ళే దారి బాగున్నా నాకు వాహనం నడిపిన అనుభవం లేకపోవడం వల్ల మరియు మలుపులు కూడా అధికంగ ఉండటం మూలాన భయం భయంగానే బయల్దేరాను. కాని ఒక్కసారి ఆ ప్రకౄతి ఒడిలోకి చేరుకున్నాక భయం లేదు. ఆ పచ్చని అందాలని చూస్తూ నన్ను నేను మైమరచిపోయాను. ఆ దారి మలుపుల్లకి అనుగుణంగా వాహనాన్ని అటు ఇటు వంచుతుంటే ఊయల ఊగుతున్న భావన. దానికి తోడుగా లయబద్దంగా వస్తున్న వాహన శబ్దం. చల్లని గాలి, పచ్చని కొండలు , ఆ కొండల మధ్యలో భద్రావతి నది వాటిపైన  నీలి నింగిలో తెల్లని రంగుతో ఎవరో బొమ్మగీసినట్టుగా ఉన్న ఆ మేఘాలు. అద్భుతం !! కుద్రేముఖ పర్వతశ్రేణి తనలో చాలా ప్రకౄతి అందాల్ని దాచి ఉంచింది.ఇలా ఎన్నెన్నో అనుభవాలు ! మాటల్లో చెప్పలేను. ఇదివరకు కారులో వెళ్ళినప్పుడు బాగుంది అనిపించినా ద్విచక్ర వాహనంలో చూసినప్పుడు కలిగిన అనుభూతి వెలకట్టలేనిది. ఈ ప్రయణంలో ఎన్నో గ్రామాలు , అక్కడి మనుషులు , ఒక్కో ఊరు ఒక్కో రకం. ఒక మనిషి జీవితంలో ఙాపకాలన్నిటిని ఒకేసారి తొంగి చూసిన భావన. ఇలాంటి యాత్రలు మళ్ళి మళ్ళి చేయాలన్న ఉత్సాహం కలిగాయి.


Sunday, March 25, 2018

అమ్మాయి

నాకు అమ్మాయే కావాలని నిన్ను కనలేదమ్మ 
నా పరువు కోసం నిన్ను కనలేదమ్మ 
నా ఇంటికి మహాలక్ష్మి వస్తుందని నిన్ను కనలేదమ్మ 
నా ప్రేమ శిఖరాన ఉన్నప్పుడు ఆ ఆనందానికి గుర్తుగా నిన్ను పొందాను 
నా ఆనందానికే ఆనందం లేకపొతే ఎలా ? 
నా ప్రేమకే ప్రేమ కరువైతే ఎలా ? 
గుర్తులు చెరిగిపోవచ్చు 
ప్రేమ తరిగిపోవచ్చు 
కాలం కరిగిపోవచ్చు 
నిజం ఎప్పటికే మారదు 
ఈ భూమికి వెలుగినిచ్చేది ఆ సూర్యుడు 

నా జీవితానికి ఆనందం నువ్వు !! 

Tuesday, November 28, 2017

సంప్రదాయం

గత కొన్నెళ్ళుగా (మూడ)భక్తి బాగా పెరిగిపోయిందని నా అభిప్రాయం. అర్థంలేని విషయాల కోసం కొట్టుకోవడం, ఇతరుల్ని దూషించడం ఎక్కువయ్యాయి.ప్రతి దానికి చెప్పే కారణం అది మన సంప్రదయం కాదు అని. సమాజంలో విలువలు తగ్గిపొతున్నాయి అని ఒక మాట అనేసి కుర్చోడం. నిర్భయ సంఘటనకి బాధ్యుల్లొ ఒక వ్యక్తి చెప్పిన సమాధానం "సంప్రదయ బద్దమైన ఆడ పిల్లలు రాత్రి 9 తర్వాత బయట తిరగరు. రేప్ లకి కారణం అబ్బాయిలకంటే అమ్మాయిలే.
ఆడ మగ సమానం కాదు.ఇంటి పనులు,కుటుంబాన్ని చుస్కోడం ఆడాళ్ళ పని, డిస్కోల్లో బార్లలో తిరగడం అనుచితమైన బట్టలు వేస్కోడం ఇవన్ని చేయకూడదు. కేవలం 20% ఆడపిల్లలే మంచి వాళ్ళు". ఇదేదొ కేవలం ఒక వ్యక్తి అలోచనగా మనం తీసివేయలేం ఎందుకంటే బాహాటంగా అందరిముందు చెప్పలేకపోయినా చాలా మంది మనసుల్లో ఉన్న భావం ఇది. వేరొక వ్యక్తితో మాట్లడినప్పుడో లేదా సన్నిహితుల మధ్య ఉన్నప్పుడో మనసులో ఉన్న మాట ఎలాంటి జంకు లేకుండా బయటికి చెప్పేస్తాం. ఇంతగా కొట్టుకు చచ్చిపోతున్నాం ఈ సంప్రదాయం కోసం, అసలు ఎక్కడిది ఈ సంప్రదాయం? ఒకప్పుడు సతి సహగమనం సంప్రదాయం, మనమంతా దాన్ని వ్యతిరేకించి , అంతమొందించిన ఎంతొ మందిని గొప్పవాళ్ళుగా చూస్తున్నాం. కాని దానిని వ్యతిరేకించిన నాడు ఆ గొప్పవాళ్ళంతా సంప్రదాయ హీనులుగానే చుడబడ్డారన్న నిజాన్ని ఎందుకు అశ్రద్ధ చేస్తున్నాం? ఈ మధ్య ఒక పెద్దాయన "భర్త చనిపోయాక భార్య ఒక్కర్తే జీవించడం కష్టం అందుకే ఒకప్పుడు సతి సహగమనం చేసేవారు" అని అన్నారు. వినటానికి ఇది చాలా సులువుగా అనిపించొచ్చు కాని నిజానికి ఈ అలోచనలో పూర్తి నిజం లేదు. ఇది అందరికి వర్తించదు. ఏ సంప్రదాయం ఐతే తల్లితండ్రుల్ని గౌరవించాలి అని చెప్పిందో దానికి వ్యతిరేఖంగా ఉంటుంది ఈ సతి సహగమనం. ఒకప్పుడు సమాజం గొప్ప నీతితో ఉంది అనప్పుడు తల్లిని జాగ్రత్తగా చూసుకునే కొడుకులు కూతుర్లు లేరా ఆనాటి సమాజంలో? నా ఉద్దేశం ప్రకారం ఒకప్పుడు రాజులు చాల మంది భార్యల్ని కలిగి ఉండేవారు, యుద్ధంలో రాజు చనిపోతే అతని భార్యలంతా శత్రువు వశం అవుతారు. ఆ రాజు వారిని చిత్రవధ చేసి చంపేయొచ్చు లేదా బానిసలుగా దాసిలుగా ఉంచుకోవచ్చు. ఏది ఏమైనా ఇంత అందమైన రాణి జీవితం నుండి బానిసలుగా బ్రతకడం అనేది చాలా కష్టం.ఆ భయం కొద్దీ వారంతా అత్మహత్యలు చేస్కునే వారు లేదా రాజు శవంతో పాటు వారు కుడ మరణించే వారు. ఆనాటి సమాజంలో రాజులు మరియు బ్రహ్మణులు అగ్రవర్ణాలుగా ఉండేవారు.దీన్ని సంప్రదాయంగా మార్చి సామాన్యుల మీద రుద్దేసారు. అలా ఇది ఆచారం అయ్యింది తప్ప నాకు తెలిసి వేరే ఏ మహత్యం లేదు. ఇప్పుడు ఏవైతే మనం అంతా సంప్రదాయ విరుద్దం అంటున్నామో కొన్నేళ్ళకి ఇది మారిపోవచ్చు. ఆది మానవుడికి ఏ సంప్రదాయం ఉంది? కొన్ని దశాబ్దాలు దిగంబరంగా సంచరించారు తర్వాత ఆకులు, జంతువుల చర్మాలు కప్పుకున్నారు. అలా నాగరికత వైపు అడుగులు వేసారు. వీటన్నిటికి కారణం పరిస్తితులు,అవసరాలు.



అద్దంలొ కనిపించే మొహం అందంగ ఉండటానికి ఎన్నో రంగులు వేస్తాం, మరి నీలో ఇంత వికౄతంగా తయరవుతున్న మనసుకు ఏ రంగు వేస్తావ్?


Monday, October 9, 2017

లేటేస్టు...! ప్రేమ టెస్టు..!!

నీ మీద ఓట్టు !
నిన్నే ప్రేమించా నేను చచ్చేట్టు,
నీకోసం వేసాను మా ఇంట్లో సిరిమల్లె చెట్టు,
నువ్వు కోయకపోతే ఆ పూలే వేస్టూ !
నేను వాడేది క్లోసప్పు పేస్టు ,
నా ఫాషను లేటేస్టు,
నాకున్న గర్ల్ ఫ్రెండ్సుల్లో నువ్వే బెస్టు ,
కావలంటే పెట్టుకో ప్రేమ టెస్టు ,
చెప్పక్కర్లేదు నాకు ఆల్ ద బెస్టు ,
ఎలా అయినా నేనే వస్తాను ఫస్టు !!

నాన్న

ఇవాళ సాయంత్రం చెల్లి ఇంటి నుండి తిరిగి వస్తుంటే ఎందుకో మేము చిన్నప్పుడు కలిసి చేసిన అల్లరి గుర్తుకు వచ్చింది.మా నాన్నగారు మమ్మల్ని తీసుకువె...