రేపటి మీద ఆశ ఉండాలంటే ఈరోజు
మీద భయం ఉండాలనుకునే బ్రతుకులు ,
గంపెడు బరువుని మీదెట్టుకుని ఆశల
చిటారు కొమ్మల్నిఅందుకోడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు!
సూర్యుని కిరణం భూమిని తాకకముందే
కష్టం వీళ్ళని నిద్రలేపుతుంది ,
ఆకలి కేకలు పెదవులు దాటకుండా
పరపతి అడ్డొస్తుంది !
మూడు పూటలు ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్లాలంటే
ఎనిమిది గంటలు అలిసిపొవాల్సిన జీవితాలు ..!
ఆశయం కన్నా కష్టం నడిపించే నడకలు నేర్చుకునేవాళ్లు . .
ఇష్టానికి అవసారనికి మధ్య ఎన్నో లెక్కలు వెస్కుంటారు…
బంధం , బాధ్యత రెందు ఒకటే అనుకుంటారు!
పండగ అంటె పరమాన్నం వండిన రోజు!
అదౄష్టమంటే అప్పు దొరికే రోజు,
మజ్జిగ గట్టిగ కలిపితె పెరుగని సర్దిచెప్పుకుంటారు !
బ్రతకటానికి భయం ఎక్కువ చావటానికి ధైర్యం తక్కువ !
నిచ్చెనలు పాములు ఒకటి వెంట ఒకటి వచ్చే వైకుంటపాళి ఆటే ఈ జీవితం!
వేసే ప్రతీ అడుగు ముందుకు సాగుతుందనుకుంటు
ఆ మిథ్యలోనే మొదలెట్టిన చొటే పయనం ముగిస్తారు!
బడుగులకి బడాబాబులకి,
ఆశకి అవసరానికి ,
వెలుగుకి చీకటికి ,
అప్పుకి ఆదాయానికి ,
గాలిలో పెట్టిన దీపపు వెలుగులా కొట్టుమిట్టాడుతూ ఉంటారు !!
బహుశా లోకంలో ఉన్న సన్యాసులందరూ ఒకప్పుడుమధ్యతరగతి వాళ్ళేనేమో !!